21, ఆగస్టు 2014, గురువారం

వేమన పద్యాలు

ఉర్వివారికెల్ల నొక్క కంచముబెట్టి
పొత్తు గుడిపి,కులము పొలయజేసి
తలను చేయిపెట్టి తగనమ్మజెప్పరో
విశ్వదాభిరామ వినురవేమ!

కోపమునను ఘనత కొంచెమైపోవును
కోపమునను మనసు కుందుజెండు
కోపమడచెనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినురవేమ!

చంపదగినయట్టి శత్రువు తనచేత
జిక్కెనేని కీడు సేయరాదు
పొసగమేలు జేసి పొమ్మనుటే చావు
విశ్వదాభిరామ వినురవేమ!

చాకి,కోక లుతికి చీకాకు పడజేసి
మైల తీసి లెస్స మడచినట్లు
బుద్ధి చెప్పువాడు గ్రుద్దితేనేమయా
విశ్వదాభిరామ వినురవేమ!

అనగననగ రాగమతిశయిల్లుచు నుండు
తినగతినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినురవేమ!

మాటలాడగల్గు మర్మము లెరిగిన,
పిన్న పెద్దతనము లెన్నవలదు
పిన్నచేతిదివ్వె పెద్దగా వెలుగదా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఇచ్చువాని యొద్ద నీయని వాడున్న
చచ్చుగాని ఈవి సాగనీడు
కల్పతరువు క్రింద గచ్చచెట్టున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

ధనము కూడబెట్టి దానంబు సేయక
తాను తినక లెస్సదాచు లోభి,
తేనేటీగ కూర్చి తెరువరికిత్తదా
విశ్వదాభిరామ వినురవేమ!

కలిమిగల్గునాడు,కానడు మదమున
లేమి నాడు మొదలె లేదుపెట్ట,
కలిమిలేమి లేని కాలమ్ము గలుగునా!
విశ్వదాభిరామ వినురవేమ!

పుత్తడిగలవాని పుండు బాధైనను
వసుధలోన చాలవార్త కెక్కు
పేదవాని ఇంటిపెండ్లైన ఎరుగరు
విశ్వదాభిరామ వినురవేమ!

తుమ్మచెట్టు ముండ్లు తోడనే పుట్టును
విత్తులోన నుండి వెడలునట్లు,
మూర్ఖునకు బుద్ధి ముందుగాబుట్టును
విశ్వదాభిరామ వినురవేమ!

పాముకన్న లేదు పాపిష్టి యగు జీవి
అట్టి పాము చెప్పినట్టు వినును
ఇలను మూర్ఖుజెప్ప నెవ్వరి తరమయా
విశ్వదాభిరామ వినురవేమ!

పొట్లకాయ రాయి పొసగ త్రాటను గట్ట
లీలతోడ వంక లేక పెరుగు,
కుక్కతోకగట్ట గుదురునా చక్కగా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఎలుగు తోలు తెచ్చి యెన్ని నాళ్ళుదికిన
నలుపు నలుపెగాని తెలుపు కాదు,
కొయ్య బొమ్మదెచ్చి కొట్టిన పలుకునా;
విశ్వదాభిరామ వినురవేమ!

ఓగునోగు మెచ్చు నొనరంగ నజ్ఞాని
భావమిచ్చి మెచ్చు పరమలుబ్ధు
బంది బురదమెచ్చు పన్నీరు మెచ్చునా?
విశ్వదాభిరామ వినురవేమ!

మృగము మృగమనుచు మృగమును దూషింత్రు
మృగము కన్న చెడ్డ మూర్ఖుడగును
మృగముకున్న గుణము మూర్ఖునకేదయా?
విశ్వదాభిరామ వినురవేమ!

హీనుడెన్ని విద్య లిల నభ్యసించిన
ఘనుడు గాడు మొరకు జనుడె గాని
పరిమళములు గార్ధభము మోయ ఘనమౌన
విశ్వదాభిరామ వినురవేమ!

విద్యలేనివాడు విద్వాంసు చేరువ
నుండగానె పండితుడు కాడు
కొలది హంసల కడ కొక్కెరలున్నట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

అంతరంగమందు నపరాధములు సేసి
మంచివానివలెనె మనుజుడుండు,
ఇతరు లెరుగకున్న నీశ్వరుడెరుగడా?
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పబుద్ధి వాని కధికారముచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు,
చెప్పు దినెడి కుక్క చెరకు తీపెరుగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు బల్కు చల్లగాను
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా?
విశ్వదాభిరామ వినురవేమ!

కాని వానితోడ గలసి మెలంగిన
హానివచ్చు నెంతవానికైన
కాకి గూడి హంస కష్టంబు పొందదా?
విశ్వదాభిరామ వినురవేమ!

గంగపారుచుండు కదలని గతి తోడ
మురికివాగు పారు మ్రోత తోడ
అధికుడోర్చునట్టు లధముడోర్వగలేడు
విశ్వదాభిరామ వినురవేమ!

వేరు పురుగుచేరి వృక్షంబు జెరుచును
చీడ పురుగు చేరి చేను జెరుచు
క్త్సితుండు చేరి గుణవంతు జెరుచును
విశ్వదాభిరామ వినురవేమ!

అల్పుడెన్ని పల్కులలయక పల్కిన
నధికు డూరకుండు నదిరిపడక
చెట్టు మీద కాకిరెట్ట వేసినయట్లు
విశ్వదాభిరామ వినురవేమ!

అధముడైన మనుజుడర్ధవంతుండైన
అతని మాట నడచు నవనిలోన
గజపతి కొలువందు గవ్వలు చెల్లవా?
విశ్వదాభిరామ వినురవేమ!

ఎంత చదువు చదివి యెన్ని నేర్చినగాని
హీనుడవగుణంబు మానలేడు
బొగ్గు పాలగడుగ బోవునా మలినంబు
విశ్వదాభిరామ వినురవేమ!

కుళ్ళుబోతునొద్ద గూడి మాటాడిన
గొప్ప మర్మములను జెప్పరాదు
పేరు తీరు దెల్ప నూరెల్ల ముట్టించు
విశ్వదాభిరామ వినురవేమ!

చెప్పులోన రాయి,చెవిలోన జోరీగ
కంటిలోన నలుసు,కాలిముల్లు
ఇంటిలోని పోరు,నింతింత గాదయా!
విశ్వదాభిరామ వినురవేమ!

తల్లిదండ్రులందు దయలేని పుత్రుండు
పుట్టనేమి! వాడు గిట్టనేమి!
పుట్తలోన చెదలు పుట్టవా! గిట్టవా!
విశ్వదాభిరామ వినురవేమ!

పాలపిట్ట శకున ఫలమిచ్చునందురు;
పాలపిట్టకేమి ఫలము దెలియు?
తనదు మేలు కీళ్ళు తనతోడ నుండగ
విశ్వదాభిరామ వినురవేమ!

రామ నామ జపముచే మున్ను వాల్మీకి
పాపి బోయడయ్యు బాపడయ్యె!
కులము ఘనము గాదు గుణమే ఘనమ్మురా
విశ్వదాభిరామ వినురవేమ!

ఔనటంచు నొక్కడాడిన మాటకు
కాదటంచు బలుక క్షణము పట్టు,
దాని నిలువదీయ ధాతయె దిగవలె
విశ్వదాభిరామ వినురవేమ!

ఆత్మశుద్ధిలేని యాచార మదియేల?
భాండ శుద్ధి లేని పాకమేల?
చిత్తశుద్ధిలేని శివపూజలేలరా?
విశ్వదాభిరామ వినురవేమ!

బంధుజనులజూడు,బాధల సమయాన,
భయమువేళ జూడు,బంటుతనము,
పేదపడ్డ వెనుక,పెండ్లాము మతి జూడు
విశ్వదాభిరామ వినురవేమ!

సుగుణవంతురాలు,సుదతియైయుండిన
బుద్ధి మతులైన పుత్రులొప్ప,
స్వర్గమేటికయ్య సంసారికింకను!
విశ్వదాభిరామ వినురమవేమ!

పుణ్యమంతగూడి,పురుషుడై జన్మింప
పాపమంత గూడి పడతి యగునె?
స్త్రీలు పురుషులనుచు ఏలయీ భేదమ్ము?
విశ్వదాభిరామ వినురవేమ!

ఉరుబలాఢ్యుడైన యుద్యోగి పరుడైన
తగిన విత్తమున్న తరుణమందె
పరులకుపకరించి పాలింపగల్గును
విశ్వదాభిరామ వినురవేమ!

ఓర్పు లేని భార్య యున్న ఫలంబేమి?
బుద్ధిలేని బిడ్డ పుట్టి యేమి?
సద్గుణంబులేని చదువది యేలరా?
విశ్వదాబహిరామ వినురవేమ!

కానివాని చేత కాసు వీసములుంచి
వెంట దిరుగువాదు వెర్రివాడు
పిల్లి తిన్న కోడి పిలిచిన పలుకునా?
విశ్వదాభిరామ వినురవేమ!

కానివాని తోడ కలసి మెలగువాడు
కాని వాని గానె కానబడును.
తాటి క్రింద పాలు త్రాగిన చందమౌ
విశ్వదాభిరామ వినురవేమ!

కోతిబట్టి తెచ్చి కొత్త పుట్టము గట్టి
కొండముచ్చు లెల్ల గొల్చినట్టు,
నీతిహీనునొద్ద నిర్భాగ్యులుందురు
విశ్వదాభిరామ వినురవేమ!

గొర్రెలు పదివేలు కూడియుండిన చోట
తల్లినెరిగి వచ్చుదాని కొదమ,
పరమయోగి నెరిగి భక్తుండు వచ్చురా
విశ్వదాభిరామ వినురవేమ!

చిక్కియున్న వేళ సింహంబునైనను
బక్క కుక్కయైన బాధపెట్టు,
బలిమిలేని వేళ పంతముల్ చెల్లవు
విశ్వదాభిరామ వినురవేమ!

కల్లుకుండకెన్ని ఘనభూషణము లిడ్డ
అందులోని కంపు చిందులిడదె?
తులువ పదవిగొన్న తొలి గుణమేమగు?
విశ్వదాభిరామ వినురవేమ!

కసవు తినుడు గాదె పసరంబు లెప్పుడు
చెప్పినట్లు వినుచుజేయు బనులు,
వానిసాటియైన మానవుడొప్పడా?
విశ్వదాభిరామ వినురవేమ!

గాడ్దెమేను మీద గంధంబు పూసిన
బూదిలోన పడుచు,పొరలు మరల,
మోటువాని సొగసు మోస్తరియ్యది సుమీ
విశ్వదాభిరామ వినురవేమ!

రాతి బొమ్మలకేల రంగైన వలువలు?
గుళ్ళు గోపురములు కుంభములును,
కూడు గుడ్డ తాను కోరునా దేవుడు?
విశ్వదాభిరామ వినురవేమ!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

తప్పకుండా మీ అభిప్రాయం నాకు తెలియచేయండి...